అతిలోక సుందరి కథ

కళ్యాణి అంటే నాకు ఇష్టం. నాకే కాదు మా ఊళ్ళో నా వయసు వాళ్ళందరికీ ఇష్టం. నా వయసు వాళ్ళకే కాదు, కళ్యాణి తెలిసిన ఏ వయసు వాళ్ళకైనా కళ్యాణి అంటే ఇష్టం. కళ్యాణి ని చూసిన ఎవ్వరికైనా కళ్యాణి అంటే ఇష్టం.

కళ్యాణి అందం గా ఉంటుంది అనేది అండర్ స్టేట్మెంట్. కళ్యాణి అద్భుతం గా ఉంటుంది. అత్యద్భుతం గా ఉంటుంది. మహాద్భుతం లా ఉంటుంది. వెన్నెల్లో ఆడపిల్ల చదువుతున్నప్పుడు, సచిన్ ఆటని చూస్తున్నప్పుడు, లతా మంగేష్కర్ పాట వింటున్నప్పుడు, మనసు ఏ విధం గా ఫీల్ అవుతుందో, కళ్యాణి ని చూసినప్పుడు కూడా అదే రకమైన ఉద్వేగానికి లోనవుతుంది. ఇది అందానికి నిర్వచనం అంటూ దేవుడు ఒక రూపం క్రియేట్ చేస్తే, అది బహుశా కళ్యాణి లాగే ఉంటుందేమో అనిపించేంత చక్కగా ఉంటుంది.

సహజం గా మనుషులు వాళ్ళ లో ఉన్న లోపాలు లేక అవలక్షణాల వల్లే మనకి ఎక్కువగా గుర్తుండిపోతారు అని నా నమ్మకం. చిన్న కళ్ళు, బండ ముక్కు, పెద్ద నోరు, ఎత్తు పళ్ళు.. ఇలాంటి వాటితోనే మనం మనుషుల్ని గుర్తుంచుకుంటాం. అందుకేనేమో ఇప్పుడు దాదాపు 7 ఏళ్ళ తర్వాత కళ్యాణి గురించి ఆలోచిస్తే నాకు ఆమె రూపం గుర్తు రావటం లేదు, ఆమె అసాధారణమైన అందగత్తె అన్న నా భావన తప్ప.

***

కళ్యాణి వాళ్ళు మా ఇంటి పక్కనే ఉండేవాళ్ళు. కళ్యాణి వాళ్ళ అమ్మ నాతో ఎప్పుడు మాట్లాడినా మా అమ్మాయి నీ కన్నా వారం రోజులు చిన్నది అని చెప్తూ ఉండేది. కళ్యాణి కీ, నాకూ పరిచయం ఎప్పుడు అయ్యిందో నాకు గుర్తు లేదు కానీ, ఆమె అంటే ద్వేషం మొదట మూడవ తరగతి లో మొదలయ్యింది. కళ్యాణి ది మా క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్ కాదు, వాళ్ళ నాన్న మా ఊళ్ళో బాగా డబ్బున్న వాళ్ళలో ఒకడు కాదు. కానీ మా స్కూ ల్లో మాష్టర్లు ఈ రెండూ ఉన్న నా కన్నా ఆమె ని ఎక్కువ ఇష్టపడేవారు. ముద్దు చేసేవారు. ఎప్పుడైనా ఆమె తప్పు చేసినా గద్దించి వదిలేసేవారు. పైగా ఆమె మిగిలిన క్లాస్ మేట్స్ లాగా నన్ను గౌరవించటం, నేను తిట్టినా పడటం చేసేది కాదు. అందుకే నేనెప్పుడూ ఆమెని బాధ పెట్టే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండేవాడిని. మాష్టర్లు ప్రశ్నలు అడిగేటప్పుడు అవకాశం వస్తే ఆమె తెల్లని బుగ్గలు ఎర్రని ఎరుపు కి మారేలా చెంపదెబ్బలు వేసేవాడిని. ఎప్పుడైనా ఆమె ఒంటరి గా దొరికితే ఏదో వంకతో ఆమె ని కొట్టేవాడిని. ఆమె కూడా ఏమీ తక్కువ కాదు.  క్లాస్ లో వున్న మిగిలిన అమ్మాయిలతో నాకు సంబంధం అంటగట్టి, నన్ను ఎగతాళి చేసేది. చిన్నపిల్లలకి నీ మొగుడు ఎవరు అంటే నా పేరు చెప్పేలాగా కోచింగ్ ఇచ్చి, అందరి ముందూ చెప్పించి, నా పరువు తీసేది.

వయసు పెరిగే కొద్దీ మాష్టర్లు ఆమెను ముద్దు చెయ్యటం తగ్గించారు. ఆమెని కూడా అందరిలాగే చూసేవారు. కానీ మిగిలిన వాళ్ళని కొట్టినట్టు ఆమెని కొట్టేవాళ్ళు కాదు. వాళ్ళకి ఆమె మీద ఉన్న ప్రేమతో పాటు ఆమె మీద నాకున్న ద్వేషం కూడా తగ్గిపోయింది. ఆమెతో స్నేహం చెయ్యకపోయినా గొడవ మాత్రం పడేవాడిని కాదు. చెంపదెబ్బలు చిన్నగా కొట్టేవాడిని. అప్పుడప్పుడూ క్లాస్ నోట్స్ కూడా ఇచ్చేవాడిని.

అలా మేము ఆరవ తరగతికి వచ్చేశాం. అప్పటి నుంచి వేకువ ఝామున ట్యూషన్ కి వెళ్ళాల్సిన అవసరం ఏర్పడింది. మా అమ్మ నన్ను పొద్దున 5 గంటలకే నిద్ర లేపి ట్యూషన్ కి పంపేది. కళ్యాణి వాళ్ళ అమ్మ పగలంతా పొలం లో పని చేసి అలసిపోయి, పొద్దున్నే తనని లేపలేకపోయేది. అందువల్ల కళ్యాణి ఎక్కువ రోజులు ట్యూషన్ కి లేట్ గా వచ్చి, మాష్టరు గారితో తిట్టించుకొనేది. అప్పుడే ఒకరోజు అడిగింది నన్ను, ఉదయాన్నే తనని కూడా నిద్ర లేపమని. మా ఇద్దరి మధ్య స్నేహం మొదలయ్యింది అప్పుడేనేమో.

వేకువ ఝామున నేను కొంచెం ముందే లేచి వెళ్తూ వెళ్తూ ఆమెని కూడా నిద్ర లేపేవాడిని. ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ, దారిలో ఉన్న పొగాకు పొయ్యిల దగ్గర చలి కాచుకుంటూ, వంద గజాల దూరం లో వున్న ట్యూషన్ మాష్టరు గారింటికి వెళ్ళేవాళ్ళం. కళ్యాణి పెద్దగా మాట్లాడేది కాదు. నేను ఏమి చెప్పినా వినేది. తనకి తెలిసిన విషయం ఐతే, ఒకటి రెండు మాటలు మాట్లాడేది. నాకు అది ఆమెలో బాగా నచ్చింది. అందుకే ఆమెతో అన్నీ మాట్లాడేవాడిని. నా క్రికెట్ నైపుణ్యం గురించి, నా ఆశయాల గురించి, మా చుట్టాల గొప్పతనం గురించి, మా నాన్న తెచ్చిన కొత్త కొత్త వస్తువుల గురించి, ఇంకా రచ్చ బండ దగ్గర కూర్చునే పెద్దమనుషుల గురించి, మా స్కూల్లో సీనియర్స్ గురించి, వాళ్ళు అమ్మాయిల మీద చేసే కామెంట్స్ గురించి.. ఇలా ఏది చెప్పినా ఆమె ఏమీ మాట్లాడకుండా వినేది. అప్పట్లోనే నేను ఆమెకి ‘గ’ సరిగా పలకదనీ, ‘గ’ బదులు చాలా సార్లు ‘ర’ అంటుందనీ గుర్తించా. అప్పుడప్పుడూ నాకు ఏదన్నా చెప్తూ “చేశాగా” అని చెప్పటానికి “చేశా రా” అనేది. “నువ్వు కావాలనే నన్ను రా అన్నవ్ కదా” అని నేను ఆమెని సరదాగా ఆట పట్టించేవాడిని. ఇంకా రోజూ సాయంత్రం మా స్కూల్ గ్రౌండ్ లో ఆమె కి కబడ్డీ నేర్పేవాడిని. ఆదివారాలు ఊరి బయట మా పశువుల పాక పక్కన ఉన్న కోడిపందాల చెట్టు కింద కోడిపందాల ఆట ఆడుకునేవాళ్ళం. అలా మా ఇద్దరి మధ్య స్నేహం చిగురిస్తున్న సమయం లో ఆమె గురించి నాకు ఒక విషయం తెలిసింది.

కళ్యాణి నా ముందే సైలెంట్ గా వుంటుందనీ, ఆమె స్నేహితురాళ్ళతో బాగానే మాట్లాడుతుందనీ, నేను ఆమె కి చెప్పినవన్నీ “మనూళ్ళో హర్ష లాగా క్రికెట్ ఆడేవాళ్ళు ఎవ్వరూ లేరంట.. హర్ష కందుకూరి వీరేశలింగం లాగా సంఘ సంస్కర్త అవుతాడంట.. వాళ్ళ బాబాయి ఒకసారి పది మంది రౌడీలని కొట్టాడంట.. వాళ్ళ నాన్న దోమల్ని చంపే మెషీన్ తెచ్చాడంట.. వూళ్ళో పూజారి టౌన్ లో ఎవర్తెతోనో తిరుగుతున్నాడంట.. మన ఫలానా సీనియర్ ఈ అమ్మాయి గురించి ఇలా అన్నాడంట” అంటూ మా క్లాస్ లో అమ్మాయిలందరికీ చెప్పేస్తూ ఉంటుందని. కానీ నేను ఆ విషయం తెలుసుకొని జాగ్రత్త పడేలోపే, నేను అన్న విషయాలు బయటికి రావటం, కొంతమంది సీనియర్స్ నాకు సీరియస్ గా వార్నింగ్ ఇవ్వటం జరిగిపొయాయి. పైగా “వీళ్ళ బాబాయి వంద మంది ని కొట్టగలడంట రా.. వీళ్ళ ఇంట్లో మెషీన్ పెట్టి దోమల్ని చంపుతారంట..” అని నన్ను ఎగతాళి చెయ్యటం మొదలుపెట్టారు. దానితో కళ్యాణి కి, నాకూ వున్న వైరం కూడా మొదటికి వచ్చింది. మేమిద్దరం మాట్లాడుకోవటం మానేశాం. ఎప్పుడన్నా ఆమె నాకు ఎదురొచ్చినా, చూడనట్టు వెళ్ళిపోయేవాడిని. ఇంత జరిగాక కూడా ఆమె ముఖం లో తప్పు చేసిన పశ్చాత్తాపం ఎప్పుడూ కనిపించేది కాదు.

కళ్యాణి వాళ్ళ పెరట్లో ఒక గన్నేరు చెట్టు వుండేది. నేను దాన్ని ఎప్పుడూ చూడలేదు. కాని ఒకసారి అది విరగపూసి పువ్వులు వాళ్ళ గోడమీద నుంచి బయటికి కనిపించినయ్. నేను అప్పటివరకూ మల్లె పువ్వు, మందారం, బంతి పువ్వు లాంటి ముదురు రంగు పువ్వులు చూశాగానీ, అలా లేత రంగు పువ్వు చూడటం అదే మొదటిసారి. అది నాకెందుకో విపరీతంగా నచ్చేసింది. కాని అది కళ్యాణి వాళ్ళ చెట్టు కావటంతో నేను వాళ్ళని అడగలేకపోయాను. ఈ విషయం ఎవరి దగ్గర విన్నదో తెలీదు, అప్పటి వరకూ ఎప్పుడూ పువ్వులు పెట్టుకోనిది, ఆ రోజు నుంచీ, తలలో గన్నేరు పువ్వులు పెట్టుకొని క్లాస్ కి వచ్చేది. నా ముందు గర్వం గా ఆ పువ్వుని తడుముకునేది. నాకు చాలా కోపం వచ్చేది. ప్రతి చిన్నదానికీ ఆమె మీద మాష్టర్లకి కంప్లయింటు చేసేవాడిని. పైగా మీ అమ్మయి సరిగ్గా చదవటం లేదు అని వాళ్ళమ్మకి పితూరీలు చెప్పి, అమ్మలక్కల ముందు ఆమెని తిట్టించేవాడిని. ఇలా మా ఇద్దరి మధ్యా ప్రచ్చన్న యుద్దం జరుగుతూ వుండగానే మా ఆరవ తరగతి పూర్తయ్యి వేసవి సెలవులు వచ్చేశాయి. స్కూల్ తెరిచేసరికి మేమిద్దరం మళ్ళీ స్నేహితులం అయిపోయాం. కారణం బేబీ.

బేబీ అమెరికాలో వుంటున్న మా పిన్ని కూతురు. వయసు నాలుగేళ్ళే అయినప్పటికీ, పిల్లల స్వతంత్ర భావాలు గౌరవించాలి అని బలం గా నమ్మే మా పిన్ని పెంపకం లో పెరగటం వల్ల చిన్నతనంలోనే ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకుంది. ఎవరిని ఎంతమాటంటే అంత మాట అనటం, వూరికే అరవటం, ఇంట్లో వస్తువులు పగలగొట్టటం, ఎవరన్నా చిన్న మాట అన్నా ఏడ్పులు, పెడబొబ్బలతో చుట్టుపక్కల వాళ్ళ ప్రశాంతతకి భంగం కలిగించటం.. ఇదే  కొంచెం అటూ ఇటూ గా బేబీ దినచర్య.. ఆ సెలవులకి బేబీ మా ఉరికి రావటంతో నేను చుట్టాల ఊళ్ళకి వెళ్ళకుండా ఇంటి దగ్గరే ఉండాల్సి వచ్చింది. నా స్నేహితులంతా వాళ్ళ బంధువుల వూళ్ళకి వెళ్ళిపోవటంతో నాకు ఆడుకోవటానికి ఎవ్వరూ లేకుండాపోయారు. దాని పైన బేబీతో ఆడుకోవలసిన (బేబీ నాతో ఆడుకుంటుంటే భరించవలసిన) అదనపు బాధ్యత.

ఎందుకో నాకు తెలీదు కానీ, సహజం గా అమ్మాయిలకి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం వుంటుంది. ఎంత ఇష్టం అంటే ఆ పిల్లలు వాళ్ళని తిడుతున్నా, కొడుతున్నా ఇంకా వాళ్ళని ముద్దు చేస్తూనేవుంటారు. అందుకేనేమో కళ్యాణి రోజూ మా ఇంటికి వచ్చేది.. బేబీ కోసం. దాదాపు రోజంతా మా ఇంట్లోనే వుండి, బేబీని ముద్దు చేస్తూ, బుజ్జగిస్తూ, బతిమాలుతూ, ఏడిస్తే సముదాయిస్తూ, తిడితే నవ్వుతూ, కొడితే పడుతూ కాలక్షేపం చేసేది. అలా బేబీతో ఆడుకునే గొప్ప బాధ్యత నుంచి నన్ను తప్పించిందనే ఏమో కళ్యాణి అంటే మా అమ్మకి చాలా ఇష్టం. రోజూ పొద్దున పూజ చెయ్యటానికి తను వచ్చేవరకూ ఆగేది. ఏవన్నా ఫంక్షన్స్ కి వెళ్తుంటే కళ్యాణి ని కూడా పిలిచేది. మా ఇంట్లో ఏమన్నా పిండి వంటలు చేసుకుంటే కళ్యాణి వాళ్ళ ఇంటికి పంపేది. నేను రోజంతా ఏవో పుస్తకాలు చదువుతూ గడిపేవాడిని. అప్పుడప్పుడూ బేబీ కళ్యాణితో ఆడుకుంటుంటే చూస్తుండేవాడిని. నల్లగా ఆఫ్రికన్ పిగ్మీలా వున్న బేబీ (అసలు ఆమె ఎవరికైనా ఎలా ముద్దొస్తుందో నాకు అర్ధం అయ్యేది కాదు) కళ్యాణి ని కొడుతూ వుంటే, శత్రువునైన నాకే ఆమె మీద జాలేసేది. ఆ జాలితోనే అప్పుడప్పుడూ ఆమెతో మాట్లాడటం ప్రారంభించాను. అలా ఆ రెండు నెలలు వేసవి సెలవులు గడిచేసరికి మేము మళ్ళీ స్నేహితులమయ్యాం. కానీ ఈసారి నేను ఆమెతో జాగ్రత్తగా వుండటం మొదలుపెట్టాను. ఎందుకంటే ఆమె బాగానే మాట్లాడుతుందని నాకు తెలుసు కాబట్టి.

కళ్యాణి అందంగా వుంటుంది అని నాకు మొదట అర్ధమయ్యింది అప్పుడేనేమో. నా స్నేహితుల్లో అందం గురించి ఎప్పుడు ఏ డిస్కషన్ వచ్చినా కళ్యాణి ని ఒకసారి తలుచుకొనేవారు. ఇంటి చుట్టుపక్కల పెద్దవాళ్ళు కూడా ఎవరన్నా ఎర్రగా వున్నారు అని చెప్పటానికి “రంగు కళ్యాణి కన్న కొంచెం తగ్గుతుందేమో” అని ఆమెతో పోల్చేవారు. “పుత్తడి బొమ్మ పూర్ణమ్మ” పాఠం చెప్తున్నప్పుడు, మా తెలుగు మాష్టరు పూర్ణమ్మ అందాన్ని వర్ణించేటప్పుడు, కళ్యాణి నే చూస్తూ చెప్పినట్టు నాకు ఇంకా గుర్తు. కాని నాకు ఆమె ఏమీ ప్రత్యేకం గా కనిపించేది కాదు. ఆమె చాలా తెల్లగా వుండేది. అందుకే అందరికీ అలా అనిపిస్తుందేమో.

ట్యూషన్ లో రాత్రిపూట ఎప్పూడైనా నిద్ర వస్తుంటే, నేను, కళ్యాణి ఒక ఆట ఆడేవాళ్ళం. ఎవరు రెప్ప వెయ్యకుండా ఎక్కువ సేపు వుంటారో అని. ఎవ్వరూ రెండోవాళ్ళని మోసం చెయ్యకుండా వుండటానికి ఇద్దరం ఒకరి వైపు ఒకరు చూసుకునేవాళ్ళం. ఆమె కళ్ళు చాలా తెల్లగా వుండేవి. వాటిలో ఎర్ర జీరలు కూడా కనిపించేవి కాదు. ఆమె ముఖం ఎప్పుడూ ఒకేలా వుండేది. ఆమె ఏడ్చినప్పుడు కూడా, ఆమె కళ్ళలో నీళ్ళు ఊరి, ఒక పొరలా మారి, కిందకి జారేవి. అంతే కానీ ఆమె ముఖం లొ ఏ ఫీలింగ్ కనిపించేది కాదు. మా ఇద్దరి మధ్య పందెం ఎక్కువసార్లు మధ్యలో ఎవరో ఒకరు రావటం వల్ల ఏ ఫలితం తేలకుండానే ఆగిపోయేది. మిగిలిన సందర్భాల్లో నువ్వే ముందు రెప్ప వేసావు అంటూ మేమిద్దరం వాదించుకునేవాళ్ళం. నేను గెలిచేవాడిని.

7వ తరగతిలో పబ్లిక్ పరీక్షలు వుండటం వల్ల మాకు ఆడుకోవటానికి, కబుర్లు చెప్పుకోవటానికి ఎక్కువ సమయం దొరికేది కాదు. పరీక్షలు దగ్గర పడుతున్న కొద్దీ క్లాస్ లొ అందరూ భయపడేవారు. ఒకవేళ పరీక్షల్లో ఒకే రూం లో కూర్చోవాల్సి వస్తే, ఆన్సర్స్ చూపించమని నన్ను అడిగేవారు. కళ్యాణి నన్ను ఎప్పుడూ అలా అడిగేది కాదు. అలా పరీక్షలు అయిపోయాయి. నేను ఫస్ట్ క్లాస్ లో, కళ్యాణి సెకండ్ క్లాస్ లో పాస్ అయ్యాం. అలా మా ఊరి బడిలో ఉన్న చివరి తరగతి పూర్తి చేశాం.

***

“కళ్యాణి” పేపర్ పైన పడిన ముత్యాలలాగ ఆ శుభలేఖ మీద మా నాన్న అందమైన చేతిరాత. తెలుగు లో రాయటానికి అన్నిటికన్నా కష్టంగా, రాయగలిగితే అన్నిటికన్నా అందంగా ఉండే ఆ రెండు అక్షరాల్నీ తనలో ఇముడ్చుకున్న పేరు. కళ్యాణి కి తన పేరంటే ఇష్టం వుండేది కాదు.

***

హైస్కూల్ లో పిల్లలు రౌడీపిల్లలు. పక్క వూరివాళ్ళం అని మమ్మల్ని తక్కువగా చూసేవాళ్ళు. ఆ బడి ఏదో వాళ్ళ సొంతం అన్నట్టు ప్రవర్తించేవాళ్ళు. మమ్మల్ని వూరికే అల్లరి పెట్టేవాళ్ళు. కళ్యాణి ని ఐతే, “కళ్యాణీ, నీ కళ్యాణం ఎప్పుడు?” అని తెగ ఏడిపించేవాళ్ళు. ఆమె పేరుకి ఆ పదం దగ్గరగా వుండటం వల్లే అలా అంటున్నారని ఆమె నమ్మకం. అది బాధపడుతూ నాకు చెప్పుకునేది. నేను మాత్రం “ఆ ప్రశ్నలో తప్పేముంది? నీ పెళ్ళి ఎప్పుడు?” అనేవాడిని. నన్ను సీరియస్ గా చూసేది. “నీకు ఎవరో బావ వున్నాడంటగా. మీ అమ్మ ఎప్పుడో అంటుంటే విన్నా.” అనేవాడిని. “నీకూ మరదలు వుందిరా..” అనేది తను ఉక్రోషం గా. ఆమె అలా తడబడగానే నేను నవ్వేసేవాడిని. (నాకు మరదలు వుందన్న మాట నిజం. కానీ ఆమె వయసు అప్పటికి ఒక సంవత్సరం. 🙂 )

రోజూ ఇద్దరం ఉదయాన్నే బయల్దేరి, పొలాలవెంట నడుచుకుంటూ రెండు మైళ్ళ దూరం లో ఉన్న హైస్కూల్ కి వెళ్ళేవాళ్ళం. మధ్యాహ్నం భోజనం కోసం ఇంటి దగ్గర నుంచి క్యారియర్ తీసుకుని వెళ్ళి, ఆ వూరి రైల్వే స్టేషన్లో కూర్చొని వచ్చే పోయే రైలుబళ్ళు చూస్తూ తినేవాళ్ళం. నాకు కళ్యాణి తో కలిసి రావటం, పోవటం ఇష్టం వుండేవి కాదు. నా స్నేహితులతో కలిసి తిరగాలనీ, వాళ్ళతోనే వుండాలనీ అనిపించేది. కానీ నా స్నేహితులకి ఎందుకోగాని నేనంటే స్నేహం కన్నా భయమే ఎక్కువ వుండేది. నాతో వున్నప్పుడు అంత ఫ్రీగా వుండలేకపోయేవాళ్ళు. అందుకే వాళ్ళంటే ఇష్టం వున్నా వాళ్ళని ఇబ్బంది పెట్టటం ఇష్టం లేక, వాళ్ళతో ఎక్కువ కలిసేవాడిని కాదు. అప్పుడప్పుడూ నేనూ కళ్యాణీ వాళ్ళతో కలిసి స్కూల్ నుంచి ఇంటికి వెళ్తుంటే నాకు చాలా ఆనందంగా వుండేది. ఒకసారి ఆ ఆనందంలో నేను సరదాగా అన్నా. “ఈ కళ్యాణి కి ఏదీ చెప్పకూడదు. ఈమె నోట్లో మాట దాగదు. ఏమన్నా చెప్పామంటే వూరంతా చాటింపు వేస్తుంది” అని. దానికి ఆమె చాలా బాధ పడింది. నాతో పలకటం మానేసింది. నేనుకూడా తనని పట్టించుకోలేదు. తర్వాత ఆమెకి నా నోట్స్ ఒకటి అవసరం అవ్వటం వల్ల నాతో మాట్లాడక తప్పలేదు. తర్వాతనుంచీ మా స్నేహం యధావిధి గా కొనసాగింది.

అప్పట్లో మేమిద్దరం ప్రతి వారం ఈటీవీలో “అన్వేషిత” సీరియల్ చూసేవాళ్ళం. ఎక్కువగా దాని గురించే మాట్లాడుకునేవాళ్ళం. ఆ రోజుల్లోనే ఒకసారి కళ్యాణి అంది నాతో “నువ్వు అచ్చం అనిరుధ్ లాగా వుంటావు హర్ష” అని (అనిరుధ్ అన్వేషిత లో హీరో). ఆమె అలా అన్న తర్వాత అద్దంలో చూసుకుంటే నాకు ఆమె చెప్పింది నిజమే అనిపించింది. కాని నేను అలా వుంటానని నాకు ఆ తర్వాత కూడా ఎవ్వరూ చెప్పలేదు.

ఒకరోజు సాయంత్రం కళ్యాణి మా ఇంటికి వచ్చింది. “హర్ష, రేపు మా ఇంట్లో బంతి. (పంక్తి భోజనాలని మా వూళ్ళో బంతి అంటారు.) నువ్వు తప్పకుండా రావాలి” అంది. నేను “బంతి ఎందుకు?” అని అడిగా.

“నేను పెద్ద మనిషి అయ్యాను.”

“అదేంటి? నిన్నటిలాగే వున్నావ్ గా??” (పెద్దమనిషి అవ్వటం అంటే మనుషులు పెద్దగా అయిపోరనీ, అది ఒక ఆడవాళ్ళ పండగ అనీ, అడిగితే సిగ్గు పడతారు తప్ప అదేంటో చెప్పరనీ అప్పటికే నాకు తెలుసు.)

తను సిగ్గు పడింది. అంటే ముఖం ఎరుపు రంగులోకి మారింది. తల దించుకుంది.

“అసలు పెద్ద మనిషి అవ్వటం అంటే ఏంటి?” మళ్ళీ అడిగా.

“నీకు పెద్దయ్యాక తెలుస్తుందిలే.” అని చెప్పి తను వెళ్ళిపోయింది.

మరుసటి రోజు సాయంత్రం వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద ఫంక్షన్ జరిగింది. కళ్యాణి లంగా, వోణీ కట్టుకొని, చాలా నగలు పెట్టుకొని వుంది. (వాటిలో చాలా వరకు మా అమ్మవి.) ఆమెని ఎర్ర ముఖ్మల్ గుడ్డతో కుట్టిన సన్మానాలు చేసే కుర్చీలో కూర్చోపెట్టారు.ఆమెకి కూడా చిన్న సన్మానం లాంటిది ఏదో చేసారు. ఏవో పాటలు పాడారు. చుట్టూ అందరూ కళ్యాణి బంగారు బొమ్మలా వుంది, కుందనపు బొమ్మలా వుంది, పుత్తడిబొమ్మలా వుంది, అపరంజి బొమ్మలా వుంది అంటూ బంగారం పర్యాయపదాలన్నీ బొమ్మ ముందు వాడి ఆమె గురించి చెప్పుకుంటున్నారు. తను వాళ్ళు చెప్తున్నంత గొప్పగా ఉందో లేదోగానీ, నాకు మాత్రం చాలా కొత్తగా, అందం గా కనిపించింది.

కళ్యాణి పెద్దమనిషి అయ్యాక, మిగిలిన వాళ్ళలాగే ఎవరి ఇళ్ళకీ వెళ్ళేది కాదు. (వాళ్ళ అమ్మ వెళ్ళొద్దని చెప్పిందట.) అబ్బాయిలతో మాట్లాడటం బాగా తగ్గించింది. నాతో అంతకుముందు లాగే మాట్లాడేది. కానీ ఎక్కువసేపు నాతో గడిపేది కాదు. అన్వేషిత చూట్టానికి కూడా మా ఇంటికి వచ్చేది కాదు. స్కూలుకి మాత్రం కలిసే వెళ్ళేవాళ్ళం. కలిసే వచ్చేవాళ్ళం.

అలా ఆ సంవత్సరం అయిపోవస్తూ వుండగా, ఇక్కడ హైస్కూలులో చదువు సరిగ్గా చెప్పట్లేదనీ, నాలాంటి తెలివైన విద్యార్ధి ని ఎక్కడన్నా దూరంగా హాస్టలు లో పెట్టి చదివిస్తే బాగా షైన్ అవుతాననీ మా నాన్నకి ఆయన స్నేహితుడొకడు హితబోధ చెయ్యటంతో, మా వూరికి వంద మైళ్ళ దూరంలో వున్న ఒక బాయ్స్ స్కూల్లో నన్ను చదివించాలని మా నాన్న నిర్ణయించాడు. మా అమ్మ మొదట దీన్ని వ్యతిరేకించినప్పటికీ, కొత్త స్కూలు గురించి నా ఉత్సాహాన్ని చూసి కాదనలేకపోయింది. అలా 9 వ తరగతి చదవటానికి నేను మొట్టమొదటిసారి గా మా ఊరు వదిలిపోవాల్సివచ్చింది. అప్పుడే నాకూ, కళ్యాణి కీ ఉన్న స్నేహానికి ఫుల్ స్టాప్ పడింది.

కొత్త స్కూల్లో చేరగానే మొదట బెంగగా, బాధగా అనిపించింది. అక్కడ నా క్లాస్ మేట్స్ ఎవ్వరూ నన్ను ప్రత్యేకంగా చూసేవాళ్ళు కాదు. పైగా నా మీద జోక్స్ వెయ్యటం, నా వస్తువులు వాడుకోవటం చేసేవాళ్ళు. నాకు అది నచ్చకపోయినా రాను రాను బాగా అనిపించేది. వాళ్ళు నాతో భయం లేకుండా మాట్లాడేవాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా నన్నూ తీసుకెళ్ళేవాళ్ళు. అలా వాళ్ళు నాకు చాలా మంచి స్నేహితులు అయ్యారు. వాళ్ళు అలవాటు పడ్డాక ఇంటి బెంగ అస్సలు వుండేది కాదు. హాస్టలు లో చేరాక నా ప్రవర్తనలో చాలా మార్పు వచ్చిందని మా అమ్మ అనేది. దసరా, సంక్రాంతి, వేసవి సెలవులకి ఇంటికి వచ్చేవాడిని. ఆ సెలవుల్లోనే కళ్యాణి వాళ్ళ చుట్టాల ఇళ్ళకి వెళ్ళేది. అయినా ఆమెతో మాట్లాడాలని నాకు ఎప్పుడూ పెద్దగా అనిపించేది కాదు. అందుకే ఆమె వూళ్ళో లేదన్న విషయం కూడా ఎవరో ఒకరు పని గట్టుకుని చెప్పేదాకా నాకు తెలిసేది కాదు. అలా నేను ఆ స్కూల్లో చదివిన రెండేళ్ళలో కళ్యాణిని ఒక్కసారి కూడా చూడలేదు.

ఆ రెండేళ్ళలో నేను తెలుసుకున్న విషయం ఏంటంటే… బాయ్స్ హాస్టళ్ళలో వుండటం వల్ల కొన్ని లాభాలు వుంటాయి. నీకు చాలా మంది మంచి స్నేహితులు ఏర్పడతారు. యవ్వనంలోకి అడుగు పెడుతున్నప్పుడు నీ శరీరంలో, ఆలోచనల్లో వస్తున్న మార్పుల్ని త్వరగా అర్ధం చేసుకోగలవు. అలాగే కొన్ని నష్టాలు కూడా. అమ్మాయిల్ని కేవలం అమ్మాయిల్లాగే చూస్తావు, వాళ్ళు అమ్మాయిలు కాబట్టే ఇష్టపడతావు. వాళ్ళు ఇష్టం అని చెప్పటానికి ఇంకో కారణం వుండదు కాబట్టి వాళ్ళంటే భయపడతూ వుంటావు.

అక్కడ 10వ తరగతి పూర్తి చేసుకొని, ఎండాకాలం సెలవులకి మా ఊరు వచ్చాను. ఈసారి కళ్యాణి ని చూసాను.

ఒకరోజు సాయంత్రం నేను బస్ స్టాండ్ దగ్గర కూర్చొని, స్నేహితులతో మాట్లాడుతుంటే, తను ఊరి బయట బావి దగ్గరనుంచి బిందెతో మంచి నీరు తీసుకొనివస్తుంది. నేను తనని చూడగానే తన చుట్టూ వున్న ప్రపంచం మొత్తం ఫేడ్ అయిపోయినట్టుగా అనిపించింది. ఆ ఫేడెడ్ బాక్ గ్రౌండ్లో నీలం రంగు వోణీ, ముదురు గులాబీ రంగు లంగా వేసుకొని బంగారు శరీర చాయతో మెరిసిపోతూ అయిదు అడుగుల తొమ్మిది అంగుళాల కళ్యాణి నడుము మీద నీటి బిందె పెట్టుకొని వెళుతూ వుంటే, నేను మాటలు ఆపేసి, నోరు తెరచుకొని, అలాగే చూస్తూ వుండిపోయా. కళ్యాణి ది కనులకి ఇంపైన అందం కాదు. కన్నులు మిరుమెట్లుగొలిపే అందం. కళ్ళు భరించలేని అందం. అంత అందం నా వైపే అలా వస్తుంటే నాకు భయం వేసింది. నా నోట్లో తడి ఆరిపోయింది. ఆమెని దగ్గర నుంచి చూస్తే నా కళ్ళు పేలిపోతాయేమో అనిపించింది. “హర్ష.. ఎప్పుడొచ్చావ్?”

ఆమెని సూటిగా చూడలేకపోయా. అడిగింది నన్ను కాకపోతే బాగుండు అనిపించింది.

“ఈ రోజే”

“పరీక్షలు బాగా రాసావా?”

“ఊ”

ఆమె అక్కడ నుండీ వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళాక కూడా నా గుండె చాలాసేపు వేగం గా కొట్టుకుంది. “చిదిమితే పాలు కారటం” అనే పదప్రయోగం అతిశయోక్తి అలంకారం కాదు.

వయసు ఆమె శరీరంలో మార్పులు తెచ్చిందో లేక నా కళ్ళలో మార్పు తెచ్చిందో తెలీదు. ఆమె అందం మాత్రం అసహజం, అసమానం, అపూర్వం, అద్వితీయం. నాజూకుతనం అనే పదానికి ఎదురు గా నిఘంటువులో ఈమె ఫోటో పెట్టొచ్చు. అసలు ఈ ఊరి రేంజ్ కి ఇంత అందం ఇక్కడ వుండటం చాలా ఎక్కువ. మనిషి నిర్మించిన వింతల్నే జనం ఎంతో ఖర్చు పెట్టి, ఎంతో కష్టపడి చూస్తున్నప్పుడు, దేవుడు సృష్టించిన ఈ వింతని ఎప్పుడు పడితే అప్పుడు ఫ్రీ గా చూడగలగటం అనేది ఈ వూరి జనం ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యం. కళ్యాణి ఇక్కడ కాకుండా ఎక్కడన్నా సిటీ లో వుండుంటే పదహారేళ్ళకే ఒక సూపర్ డూపర్ బంపర్ మోడల్ అయిపోయేదేమో.

ఆ రోజు నుంచి ఆమెనే గమనించటం మొదలు పెట్టాను. మంచి నీళ్ళు తీసుకురావటానికి తప్పితే ఎందుకూ బయటికి వెళ్ళేది కాదు. నేను ఆరు బయట మంచం వేసుకొని, పుస్తకం చదువుతున్నట్లు నటిస్తూ వాళ్ళ ఇంటి వైపే చూస్తూ వుండేవాడిని. ఆమె అప్పుడప్పుడూ బయటికి వచ్చేది. ఆమె చూస్తుందేమో అని నేను తల తిప్పేసుకునేవాడిని. ఒకవే ళ ఆమె ఎక్కువసేపు బయట వుంటే నేను లోపలికి వెళ్ళిపోయేవాడిని. (మళ్ళీ నేను సైటు కొడుతున్నానని అనుకుంటుందేమో అని.) ఇక రోజూ బస్ స్టాండ్లో కూర్చొని ఆమె మంచి నీళ్ళకి వెళ్ళి వస్తుంటే చూస్తూ వుండేవాడిని.

ఆమె ని చూస్తూ వుంటే, ఆమె అందాన్ని పదాల్లోనో, గీతల్లోనో బంధించి, భావితరాలకి ఆమె అందాన్ని గురించి తెలుసుకొనే అవకాశం కల్పించటానికి, నేను కవినో, చిత్రకారుడ్నో కానందుకు నాకు కొంచెం బాధగా అనిపించేది. అయినా ఎత్తైన హిమాలయం, లోతైన సముద్రం, స్వచ్చమైన చిన్నపిల్లల నవ్వు, తెల్లని మల్లెపువ్వు, అందమైన కళ్యాణి… వీటిని వేటితోనూ పోల్చలేం. వర్ణించలేం. చిత్రించలేం.

కళ్యాణి అందానికి ఒక ప్రత్యేకత వుంది. ఆమెని చూస్తే ఎవ్వరికీ వాంఛ కలగదు. ఒక రకమైన గౌరవం కలుగుతుంది. ఇదే కారణం అయ్యుండొచ్చు లేక ఆమె ఎప్పుడూ సీరియస్ గా వుండటం వల్ల అయ్యుండొచ్చు (ఒకవేళ ఇదే కారణం ఐతే అది వాళ్ళ అపోహ. ఆమె ముఖం లో భావాలు బయటికి కనపడవు. అంతే.) ఆమె కోసం అబ్బాయిలు ఎవ్వరూ ట్రై చేసేవాళ్ళు కాదు. ఆమె గురించి తక్కువగా మాట్లాడటం కూడా చేసేవాళ్ళు కాదు.

కళ్యాణి ఎప్పుడూ లంగా, వోణీ వేసుకునేది. మధ్యలో బంగారు రంగు లేత నడుము. వీపు పైనుండీ ఆ నడుము మీదగా కిందకి జారుతూ పొడవైన జడ. ఒకవేళ పొరపాటున ఎప్పుడన్నా ఆమె నడుముకి నా చెయ్యి తాకితే, ఆ స్పర్శలోని సుకుమారత్వానికి నా చేతికి పక్షవాతం వస్తుందేమో…

కళ్యాణి నడుస్తూవుంటే, అసలు ఇంత అందం ఈ భూమి మీద ఇంతకుముందు ఎప్పుడైనా నడిచి వుంటుందా అనే సందేహం వస్తుంది. ఒకవేళ కళ్యాణి అప్పట్లోనే వుండుంటే శ్రీదేవి “పదహారేళ్ళ వయసు” లో నటించివుండేది కాదు. దేవులపల్లి కృష్ణశాస్త్రి మల్లీశ్వరి ఇంకా మధురం గా వుండి వుండేది. ఆమె గుర్తుగా తాజ్ మహల్ కన్న అందమైన భవనం ఒకటి వుండి వుండేది. మాయల ఫకీరుకి మాయా దర్పణంలో బాల నాగమ్మ కనిపించి వుండేది కాదు. దమయంతి స్వయంవరానికి దేవుళ్ళు మారు వేషాల్లో వచ్చేవాళ్ళు కాదు. శ్రీకృష్ణుడికి తొమ్మండుగురు పట్టమహిషులుండేవాళ్ళు.

ఒకవేళ కళ్యాణి అప్సరస అయ్యుంటే, ఋషులు దేవుడి కోసం కాక, దేవుడి కన్నా ముందు వచ్చే ఆమె కోసం తపస్సు చేసేవాళ్ళు. కళ్యాణి వరూధిని స్థానం లో వుండుంటే, ప్రవరాఖ్యుడు ఆమె అందంలోని దైవత్వానికి దాసోహం అనేవాడు. ఆమె ద్రౌపది అయితే, ధర్మరాజు జూదంలో ఆమెని ఒడ్డేవాడు కాదు. లేకపోతే వస్త్రాపహరణం జరగగానే, కురుక్షేత్రం జరిగివుండేది. అహల్య ఆమెలా వుంటే, గౌతమ మహర్షి ఆమె శీలాన్ని శంకించినప్పటికీ శపించకుండా, గుట్టుగా కాపురం చేసుకునేవాడు.

“హర్షా, నువ్వు కళ్యాణిని ట్రై చెయ్యొచ్చుగా.” నా స్నేహితుడొకడు అనేవాడు.

“ఆ అమ్మాయి నీకు మంచి ఫ్రెండ్ కదా. చాలా మంచిది కూడా. ఒప్పుకుంటే పెళ్ళి కూడా చేసుకోవచ్చు.”

నేను లోపల సిగ్గు పడ్డా, పైకి సరదాగా నవ్వేసేవాడిని. ఇంచుమించు ఆమె అంతే ఎత్తు, ఆ ఎత్తుకి తగినదానికన్న చాలా లావుగా, నల్లగా వుండే నేను ఆమె పక్కన నిల్చుంటే ష్రెక్ సినిమాలో భయంకరమైన ష్రెక్, ఏ శాపంలేని అందమైన యువరాణి జోడి లాగా, లేకపోతే కింగ్ కాంగ్ లో కింగ్ కాంగ్ మృగం, దాన్ని ఆకర్షించిన అమ్మాయి ల జంట లాగా అసహ్యం గా వుండదూ?

ఆమె మీద నాకు వుంది కేవలం ఆమె అందం పై వున్న వల్లమాలిన గౌరవమో, లేక అంత అందాన్ని పొందే అర్హత నాకు లేదన్న ఇన్ ఫియారిటీ కాంప్లెక్సో తెలీదు కానీ, ఆమెని సొంతం చేసుకోవాలని నేను ఎప్పుడూ ప్రయత్నించలేదు.

ఐనా ఆ అందాన్ని సొంతం చేసుకొనే అర్హత ఈ చుట్టు పక్కల వూళ్ళలో కూడా ఎవ్వరికీ లేదని నా వుద్దేశం. ఇదే రాజుల కాలం ఐతే, ఏదో ఒకరోజు ఒక రాకుమారుడు కళ్యాణిని వెతుక్కుంటూ వచ్చి, ఇక్కడే గాంధర్వ వివాహం చేసుకొని తీసుకుపోయేవాడు. కళ్యాణి లాంటి భువనైక సౌందర్యాన్ని సొంతం చేసుకోవటం కోసం యుద్ధాలు జరిగేవి. కానీ ఇప్పట్లో రాజులు లేరు కాబట్టి, ఎవడన్నా సినిమాల్లో హీరోలాగా అందంతో పాటూ, మంచి గుణం, డబ్బు.. అన్నీ వున్నవాడు వచ్చి ఆమెని తీసుకెళ్తాడు.

కళ్యాణి వాళ్ళమ్మ అప్పుడప్పుడూ నన్ను వాళ్ళింటికి రమ్మని అహ్వానించేది. నేను వెళ్ళేవాడిని కాదు. ఎప్పుడన్నా కళ్యాణి మా ఇంటికి వచ్చినా, ఆమెకి కనిపించకుండా ఏదో ఒక గది లోకి వెళ్ళి ఆమెనే గమనిస్తూ ఉండేవాడిని. అలా ఆ రెండు నెలలూ గడిచిపోయాయి.

నా 10వ తరగతి మార్కులు చూసి మా నాన్న చాలా ఆనందపడి, మళ్ళీ వాళ్ళ స్నేహితుడి సలహా మేరకు నన్ను 200 మైళ్ళ దూరంలో వున్న ఒక జూనియర్ కళాశాలలో చేర్చాడు. ఈసారి కూడా బాయ్స్ హాస్టలులోనే. ఇక్కడ ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలనీ అవనీ ఇవనీ అస్సలు సెలవులిచ్చేవాళ్ళే కాదు. ఎప్పుడన్నా ఇచ్చినా 5, 6 రోజులే ఇచ్చేవాళ్ళు. ఆ రెండేళ్ళలో నేను మా వూళ్ళో గడిపిన రోజులు మహా అయితే ఒక ముప్పై వుంటాయేమో. సెలవులకి వూళ్ళో అడుగుపెట్టిన దగ్గర నుంచీ నాకళ్ళు కళ్యాణినే వెతికేవి. ఆమెని ఎప్పుడు చూసినా కొత్తగానే అనిపించేది. ఎంతసేపు చూసినా చాలు అనిపించేది కాదు. ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేది. కానీ ఎప్పుడైనా తను ఎదురైతే మాత్రం నేను ముఖం తిప్పుకుని వెళ్ళిపోయేవాడిని.

“ఏంట్రా.. వూళ్ళో వాళ్ళతో సరిగ్గా మాట్లాడటం లేదంట” ఒకరోజు మా నాన్న అడిగాడు.

“ఏవరన్నారు?”

“కళ్యాణి… నవ్వుతూనే అందిలే.. హర్షని కొంచెం మాతో కూడా మాట్లాడమని చెప్పు మామయ్యా అని”.

నాకెందుకో చాలా ఆనందం వేసింది. కొన్ని రోజుల తర్వాత మా అమ్మ కూడా ఇదే మాట చెప్పింది. నాకు ఇంకా ఆనందం వేసింది. ఆమెతో మాట్లాడాలని నిర్ణయించుకున్నాను. అప్పటికి నా ఇంటెర్మీడియట్ రెండేళ్ళూ అయిపోయి, వేసవి సెలవులకి మా వూరికి వచ్చేశాను.

నిర్ణయించుకోవటం అయితే నిర్ణయించుకున్నా కాని, ఆమె దగ్గరికి వెళ్ళాలంటేనే భయం వేసేది. ఆమే వచ్చి పలకరిస్తే బాగుంటుంది అనిపించేది. అలా నేను ఆమెతో మాట్లాడటానికి ఇంకో నెల రోజులు పట్టింది. అదీ మా పక్క వీధిలో ఒక పెళ్ళిలో. నేను ఒక్కడినే కూర్చొని వుంటే, వచ్చి నా పక్కన కూర్చుంది. సాధారణమైన దుస్తులలోనే అసాధారణం గా కనిపించే కళ్యాణి, చీర కట్టుకొని నగలు పెట్టుకొని నాకు అంత దగ్గరగా కూర్చుంటే, నా గుండె గుబగుబ లాడింది. కాని ఎలాగైనా మాట్లాడాలని సంకల్పంతో అక్కడ నుంచి లేచి వెళ్ళిపోకుండా కూర్చున్నాను. ఆమె ఏదో అడిగింది. నేను ఏదో చెప్పాను. ఇద్దరం అలా కాసేపు మాట్లాడుకున్నాం. ఏం మాట్లాడుకున్నామో ఆ స్థితిలో నాకు సరిగా అర్ధం కాలేదు కానీ, ఆమె గొంతులో చిన్నప్పుడు నాతో మాట్లాడినప్పుడు వున్న స్నేహభావం, నా గొంతులో ఆమెని చూడటం అదే మొదటిసారి అన్నట్టుగా ఒక నెర్వస్ నెస్ నాకే క్లియర్ గా వినిపించాయి. ఆ తర్వాత ఆమె మా ఇంటికి కొంచెం ఎక్కువగానే వచ్చేది. నేను బాగా మాట్లాడకపోయినా, ఒకటి రెండు మాటలు అలా మాట్లాడేవాడిని.

ఇంతలో నా ఇంటర్ రిజల్ట్స్ వచ్చాయి. అవి చూసి మా నాన్న ఆనందానికి అవధులు లేవు. నా మార్కులకి, నేను వుండే దూరానికీ సంబంధం వుంది అనుకున్నాడో ఏమో, ఆయన ఈసారి నన్ను 2000 మైళ్ళ దూరం లో ఉన్న ఒక కాలేజీలో చేర్చాడు. కానీ ఈసారి కో ఎడ్యుకేషన్ వున్న కాలేజీలో. మొదట్లో అమ్మాయిలతో మాట్లాడటం ఇబ్బంది గా అనిపించేది. చిన్నగా వాళ్ళతో మాట్లాడటం, స్నేహం చెయ్యటం మొదలుపెట్టాను. కానీ నాకు కాలేజీలో అమ్మాయిలెవ్వరూ అందంగా కనిపించేవారు కాదు. నా ఫ్రెండ్స్ ఈ అమ్మాయి అందగత్తె అని ముద్ర వేసినవాళ్ళు కూడా, కళ్యాణితో పోల్చుకుంటే, సామాన్యంగా అనిపించేవారు. వీళ్ళనే అందగత్తెలు అంటున్నారంటే, ఇంక కళ్యాణి ని చూస్తే ఏమంటారో. వీళ్ళని ఒకసారి మా వూరు తీసుకెళ్ళి కళ్యాణిని చూపించాలి. కాని ఈసారి నేను మా ఊరు వెళ్ళటానికే ఒక సంవత్సరం పట్టింది. మా తాత అనారోగ్య కారణాల రీత్యా మా ఫ్యామిలీ ఆ యేడు పక్కనే వున్న టౌనులో వుండాల్సొచ్చింది. అందువల్ల మళ్ళీ తర్వాత వేసవి సెలవులదాకా నేను మా ఊరికి రాలేకపోయాను.

ఊరికి వెళ్ళగానే, కళ్యాణి వాళ్ళింటికి వెళ్దామనిపించింది. కాని అంతకు ముందు ఎప్పుడూ వాళ్ళింటికి వెళ్ళకుండా, ఇప్పుడు వెళ్తే బాగుండదేమో అని సంశయించాను. సాయంత్రం బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. కళ్యాణి నీళ్ళు తీసుకొని వస్తూ వుంటుంది. నన్ను చూసి ఎప్పుడొచ్చావ్ అని అడుగుతుంది. అలా తనతో మాట్లాడదాం అని. కానీ తను ఆ రోజు రాలేదు. తర్వాత రోజు కూడా రాలేదు. తర్వాత మా ఫ్రెండ్స్ లో ఒకడిని అడిగితే చెప్పాడు తనకి రెండు నెలల ముందే పెళ్ళైపోయిందని. అబ్బాయిది పక్క వూరంట. అంటే నేను కళ్యాణిని మళ్ళీ ఈ వూళ్ళో అలా నీటి బిందెతో చూడలేను.

ఆ రోజు కళ్యాణి వాళ్ళమ్మ నన్ను వాళ్ళింటికి పిలిచింది. ఈసారి నేను వెళ్ళాను. నేను కళ్యాణి పెళ్ళికి వుండి వుంటే బాగుండేది అంది. కళ్యాణిని వాళ్ళ బావకే ఇచ్చారంట. ఆయన స్వయానా ఈమె పిన్ని కొడుకంట. చాలా మంచివాడు, సమర్ధుడంట. తనకి పెత్తనం వచ్చాక పది ఎకరాల పొలం సంపాయించాడంట. వాళ్ళ వూళ్ళో తన మాటకి ఎదురేలేదంట. ఆయన తనని చేసుకోవటం కళ్యాణి అదృష్టం అని చెప్పింది. ఇదేమీ కళ్యాణి అదృష్టం కాదు, ఆమె అందానికి ఇలాంటివాడు రావటం లో ఆశ్చర్యం లేదనిపించింది నాకు. “చూడటానికి అలా గంభీరం గా వుంటుంది కానీ, వట్టి వెర్రిబాగులది. అమాయకురాలు. నోట్లో నాలుక లేని పిల్ల. దానికి ఎలాంటివాడు వస్తాడో అని భయపడేదాన్ని. ఇప్పుడు నిశ్చింతగా వుంది. ఇక ఈ రెండో అమ్మాయికి పెళ్ళి చేస్తే నేనూ, మీ మామయ్యా కృష్ణా, రామా అనుకుంటూ అలా బతుకు వెళ్ళదీస్తాం.” అని ఆనందంగా చెప్పింది.

ఒకరోజు ఊరి బస్ స్టాండ్ దగ్గర కుర్రోళ్ళు, ముసలోళ్ళూ కూర్చొని మగతనం అన్న టాపిక్ మీద సరదాగా వాదించుకుంటున్నారు. “వయసుకీ, మగతనానికీ సంబంధం ఏముందిరా? దేవి వాళ్ళయనకి పట్టుమని పాతికేళ్ళు లేవు. తొమ్మిదింటికే ఆరు బయట పక్కేసుకొని, గుర్రు పెట్టి నిద్ర పోతాడంట. మరి కళ్యాణి వాళ్ళాయన.. ముప్పై పై మాటే. కానీ సగం వూరిని దున్నేశాడంట. పెళ్ళయాక కూడా మనిషి దూకుడు ఏ మాత్రం తగ్గలేదంట.” మా ఎదురింటి ముసలాయన అన్నాడు. అది విని నేను నా స్నేహితుడిని అడిగాను కళ్యాణి వాళ్ళాయన గురించి.

“మంచివాడేనా?”

“బతకనేర్చినవాడు. ఏ ఎండకా గొడుగు పడతాడు.”

“కళ్యాణి ని ఆయన చేసుకోవటం ఆమె అదృష్టం అంది వాళ్ళమ్మ?”

“అంత సీన్ లేదు. అసలు కళ్యాణిని చేసుకుందామనే ఇన్నేళ్ళు ఆగాడు.”

ఎందుకో మనసుకి కొంచెం బాధగా అనిపించింది.

ఆ తర్వాత నేను కళ్యాణిని ఒకేసారి చూసాను. రెండేళ్ళ తరువాత ఒకరోజు సాయంత్రం చిరు చీకట్లు కమ్ముకుంటున్న వేళ నేను మా వూరికి వస్తుంటే, ఒక మోపెడ్ మీద ఒక మధ్య వయస్కుడు ఎదురొచ్చాడు. అతను బాగా దగ్గరికి వచ్చాక, అతని మెడ పైనుండీ ముందు రోడ్డు వైపుకి చూస్తున్న ఒక కన్ను కనిపించింది. ఆ కంటిలో అభావం.. నాకు ఏళ్ళ తరబడి పరిచయం వున్న అదే అభావం… ఆమె కళ్యాణి. నేను ఆమెని గుర్తించే లోపే ఆ మోపెడ్ నన్ను దాటుకొని వెళ్ళిపోయింది. ఇక అంతే.

***

“ఆ తర్వాత ఈ ఐదేళ్ళలో నాకు తను ఎప్పుడూ గుర్తుకు రాలేదు అని చెప్పను కానీ, తనను నేను ఎప్పుడూ చూడలేదు, తన గురించి ఎవరి దగ్గరా వినలేదు. ఇదిగో ఇప్పుడే ఈ శుభలేఖ మీద ఆమె పేరు చూస్తున్నా. నీ పెళ్ళి పిలుపుల సందర్భం గా ఆమెని కలవబోతున్నా.”

“కళ్యాణి నిజంగా అంత అందగత్తా?” తను నా కజిన్. వరసకి అన్న అవుతాడు.

“చూస్తావు గా ఈ రోజు..”

కళ్యాణితో కాసేపు గడపాలనీ, సరదాగా కొంచెంసేపు చిన్ననాటి సంగతులు మాట్లాడాలనీ, నా జ్ఞాపకాల ఫ్రేం లో నుంచి జారి పడిపోయిన ఆమె రూపాన్ని మళ్ళీ అక్కడే గట్టిగా ఫిక్స్ చెయ్యాలనీ, ఇవ్వాల్సిన శుభలేఖలన్నీ ముందే ఇచ్చేసి, సాయంత్రం అయ్యేసరికల్లా వాళ్ళ వూరికి చేరుకున్నాను మా అన్నతో కలిసి.

నన్ను చూడగానే కళ్యాణి, ముఖంలో అదే నిర్మలత్వం నింపుకొని ఒక చిరునవ్వు నవ్వుతుంది. నేను శుభలేఖ ఇవ్వగానే అది చూసి, “మరి నీ పెళ్ళి ఎప్పుడు?” అని అడుగుతుంది. “నీ లాంటి అమ్మాయి దొరికితే అప్పుడు చూద్దాం.” అంటే… సిగ్గు పడుతుంది. అంటే ముఖం ఎర్రబడుతుంది, తను తల దించుకుంటుంది. ఒకవేళ వాళ్ళాయన పక్కనే వుంటే ఫీల్ అవుతాడేమో. లేదులే.. కళ్యాణి నా గురించి ఆయనకి మంచి గా చెప్పి వుంటుంది.

వూళ్ళోకి వెళ్ళగానే ఒక ఇంటి ముందు ఆగి, అక్కడున్న ముసలాయన్ని అడిగాం. “కళ్యాణి వాళ్ళ ఇల్లు ఎక్కడ?”. ఆయన వేలెత్తి రెండు మూడు వీధుల అవతల వున్న ఒక కొత్త డాబా చూపించాడు. కళ్యాణి ఆ వూళ్ళో కూడా అందరికీ తెలిసే వుంటుంది. ఆమె అందం అలాంటిది మరి. ఆ ఇంటికి వెళ్ళగానే, ఇంటి ముందు ఆడుకుంటున్న పిల్లోడు ఒకడు ప్రశ్నార్ధకం లా ముఖం పెట్టి మమ్మల్ని చూశాడు. “కళ్యాణి గారిని కలవాలి.” కళ్యాణి గారు… ఆ పిలుపుకి నాకే నవ్వొచ్చింది. వాడు “పిన్నీ, నీ కోసం ఎవరో వచ్చారు” అని పెద్దగా అరచి, మళ్ళీ వాడి ఆటలో నిమగ్నమయ్యాడు. “ఎవరూ?” వెనుక గదిలో నుంచీ వినిపించీ వినిపించనట్టు ఒక గొంతు. కళ్యాణిదే లాగుంది. తర్వాత, ఇంటి మొదటి నుంచి చివర దాకా వరుసగా వున్న ద్వారాల నుండీ పెరట్లో కనిపిస్తున్న సాయంకాలం సూర్యుడికి అడ్డం పడి, మా వైపుకి వస్తున్న, ఒక ఐదడుగుల తొమ్మిదంగుళాల సన్నని స్త్రీ ఆకారం అవుట్ లైన్ కనిపించింది. అది కళ్యాణి యే. ఆమె హాలు దాటి వరండాలో వున్న మా ముందుకు వచ్చి నిల్చుంది. నీరెండ వెలుగులో ఆమె ముఖం నేనెప్పుడూ చూడనంత స్పష్టం గా కనబడింది.

ఆమె… అతిలోక సుందరి, అసమాన సౌందర్యరాశి, అపురూప లావణ్యవతి, భువనైక సుందరి, శ్రీదేవి, మల్లీశ్వరి, ముంతాజ్, బాలనాగమ్మ, దమయంతి, రుక్మిణి, ఊర్వశి, వరూధిని, అహల్య, ద్రౌపది, వెన్నెల్లో ఆడపిల్ల, సచిన్ టెండూల్కర్, లతా మంగేష్కర్, హిమాలయం, సముద్రం, మల్లెపువ్వు, చిన్నపిల్లల నవ్వు… కళ్యాణి.

అంత అసాధారణమైన అందాన్ని చాలా కాలం మోసినట్టుగా ఆమె భుజాలు ముందుకి వంగిపోయాయి. బుగ్గల్లో వున్న పాలన్నీ చిదిమేసినట్టుగా బుగ్గలు సున్నితత్వం కోల్పోయి, లోపలికి వెళ్ళిపోయాయి. ఆమె తెల్లని శరీరం మరింత తెలుపెక్కి పాలిపోయింది. ఆమె నాజూకుతనం మరింత నాజూకయ్యి, చర్మం ఎముకలకు అంటుకుపోయింది. ఆమె శరీరంలోని ఆ బంగారు మెరుపు పసుపు పచ్చగా ఆమె పళ్ళపై పేరుకుపోయింది. నిర్మలత్వం ఇంకిపోయి పీక్కుపోయిన ఆమె కళ్ళలో, ఎండిపోయిన బావిలో ఎన్నో ఏళ్ళ తర్వాత వూరిన వూటలా ఒక్కసారి గా తన్నుకొచ్చిన ఆనందం కనిపించింది. ఆ ఆనందం లో ఆమె నన్ను ఏదేదో అడుగుతుంది. ఆమె భాషలో పల్లెటూరి యాస స్పష్టం గా ధ్వనిస్తుంది. ఆమె పదాలలో “చ” బదులు “స” ఎక్కువగా పలుకుతుంది. నేను యాంత్రికం గా ఏదేదో సమాధానమిస్తున్నాను. ఈ రూపం ఏళ్ళ తరబడి నేను ఆమె గురించి పెంచిపోషించుకున్న నా ఊహల మీద, భావాల మీదా దాడి చేసి, నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తూ, ఊపిరాడకుండా నా గొంతు నులుముతున్నట్లు అనిపించింది. ఇక ఆమెని చూడలేకపోయాను. “వచ్చే ఆదివారం అన్న పెళ్ళి. మీరు తప్పక రావాలి.” చెప్పేసి బయల్దేరబోయాను.

“మొదటిసారి మా ఇంటికి వచ్చావ్. ఏదన్నా తిని వెళ్ళు హర్షా” కొంచెం బాధగా అంది.

“ఇంకా పిలవాల్సిన వాళ్ళు చాలా మంది వున్నారు. ఈసారి వచ్చినప్పుడు తింటాలే.”

“మరి నీ పెళ్ళెప్పుడు?”

నవ్వి, వెనక్కి తిరిగి, మా అన్న చెయ్యి పట్టుకొని బయటికి వచ్చేశాను. కళ్యాణి రూపం నేనిక ఎప్పటికీ మర్చిపోలేనంత బలంగా నా మనసులో ముద్రించుకుపోయింది.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s